
ఢిల్లీ, 22మార్చి (హి.స.) ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఆధ్వర్యంలోని అనువాదిని విభాగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వాట్సప్ తరహాలో హైప్డ్ సంవాదిని మెసెంజర్, దేశీ ఏఐ జెన్జీ కీబోర్డులను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు భారత్లో స్మార్ట్ఫోన్లు ఉపయోగిస్తున్న 80 కోట్ల మంది ఈ రెండు అవసరాల కోసం విదేశీసంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్ని మాత్రమే ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంది. వీటిని ఆధారంగా చేసుకొని డిజిటల్ అరెస్ట్లు, స్పామ్కాల్స్, ఆర్థిక మోసాలు, నకిలీ బ్యాంకింగ్ కాల్స్ పెరిగిపోయిన నేపథ్యంలో వాటికి అడ్డుకట్టవేసేందుకు ఏఐసీటీఈ ఆధ్వర్యంలోని అనువాదిని విభాగం ఈ రెండు యాప్స్ని అభివృద్ధి చేసింది. వీటిని ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులంతా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. హైప్డ్ సంవాదిని వాట్సప్ తరహాలో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్గా ఉంటుంది. అడ్వాన్స్డ్ యాంటీస్పామ్ మెకానిజాన్ని ఇందులో పొందుపరిచారు. ఇది సైబర్మోసాలను నియంత్రిస్తుందని కేంద్రం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ హైప్డ్సంవాదినిలో వన్-టు-వన్, గ్రూప్, బ్రాడ్కాస్ట్ మెసేజ్లు సుభద్రంగా పంపుకోవచ్చు. ఆడియో, వీడియోకాల్స్ చేసుకోవచ్చు. 55కిపైభాషల్లో రియల్టైం ట్రాన్స్లేషన్ అందుబాటులో ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ