ఎమ్మెల్యే దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు
ఎమ్మెల్యే దానం నాగేందర్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్ పార్టీ మారలేదంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు.
Danam nagender


హైదరాబాద్, 23 మార్చి (హి.స.)ఎమ్మెల్యే దానం నాగేందర్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్ పార్టీ మారలేదంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు ఎమ్మెల్యే దానం నాగేందర్తోపాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని వారిని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.

2023 ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ బరిలోకి దిగి గెలిచారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ స్పీకర్ను బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కోరారు. దీనిపై స్పీకర్ విచారణ చేపట్టకపోవడంతో.. వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ విచారణ జరిపి.. ఎవరూ పార్టీ ఫిరాయింపునకు పాల్పడలేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫారమ్ తీసుకుని ఎంపీగా దానం నాగేందర్ ఎన్నికల్లో పోటీ చేశారని బీజేపీ ఎమ్మెల్యే పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తీసుకున్న జీతభత్యాలను వెనక్కి తీసుకోవాలంటూ కోర్టులో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande