
హైదరాబాద్, 23 మార్చి (హి.స.)
ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ఇద్దరు గంజాయి పేడ్లర్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 10.089 కిలోల డ్రై గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ జీఆర్పీ, ఈగుల్ టీమ్, ఆర్పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ విజయాన్ని సాధించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు ₹5,04,450గా పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా కు చెందిన దీపక్ సాహు (26), దీపక్ గౌడ (20) అనే ఇద్దరు స్నేహితులు త్వరగా డబ్బు సంపాదించాలని గంజాయి రవాణాకు పాల్పడ్డారు. ఢిల్లీలో గంజాయికి అధిక డిమాండ్ ఉండటంతో అక్కడ విక్రయించి లాభాలు పొందాలనే ఉద్దేశంతో ఈ నెలలోనే ఒకసారి గంజాయి తరలించి విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. మరోసారి గంజాయి రవాణా కోసం మార్చి 22న గజపతి అటవీ ప్రాంతం నుంచి సుమారు 10 కిలోల గంజాయిని ₹35,000కు కొనుగోలు చేసి, విశాఖ ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ చేరుకున్నారు. అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లే మరో రైలులో ప్రయాణించేందుకు ప్లాన్ చేశారు. సోమవారం సికింద్రాబాద్కు చేరుకున్న అనంతరం, రాత్రి రైలు వరకు వేచి ఉండేందుకు జనరల్ వెయిటింగ్ హాల్లో ఉండగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో వారి వద్ద ఉన్న బ్యాగుల్లో గంజాయి ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి గంజాయి ప్యాకెట్లతో పాటు రెండు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ ను సికింద్రాబాద్ రైల్వే పోలీస్ అధికారులు, ఈగుల్ టీమ్, ఆర్పీఎఫ్ సిబ్బంది సమన్వయంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీపీ రైల్వే & రోడ్ సేఫ్టీ కె. రమేష్ నాయుడు ఈ ఆపరేషన్లో పాల్గొన్న అధికారులను అభినందించారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు వారు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు