పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, 23 మార్చి (హి.స.) జిల్లాలోని పశుపోషకులు గాలికుంటు వ్యాధి నివారణపై అప్రమత్తంగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో పశువైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న
Collector


భూపాలపల్లి, 23 మార్చి (హి.స.)

జిల్లాలోని పశుపోషకులు గాలికుంటు వ్యాధి నివారణపై అప్రమత్తంగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో పశువైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ ప్రచార రథాన్ని, కర పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి ఒక అంటువ్యాధి కాగా, ఇది పికార్నో వైరస్ వల్ల సోకుతుందని తెలిపారు. ఈ వ్యాధి మన రాష్ట్రంలో ప్రధానంగా 0, A, ASIA-1 రకాల వల్ల వ్యాపిస్తుందని, ఈ వ్యాధి సోకిన పశువుల్లో మరణాల శాతం తక్కువగానే ఉన్నప్పటికీ, పాలు దిగుబడి తగ్గడం, పునరుత్పత్తి సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. ముఖ్యంగా సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

వ్యాధి లక్షణాలుగా పశువులకు అధిక జ్వరం (104°F -106°F), నోరు, కాళ్ల గిట్టల మధ్య బొబ్బలు, నోటి నుంచి చొంగ కారడం, పాలు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. పశువులు మేత, నీరు తీసుకోక నీరసించి మరణించే ప్రమాదం ఉందన్నారు. ఈ వ్యాధి నివారణకు పశువుల పాకలను శుభ్రంగా ఉంచడం, 4 నెలల వయస్సు దాటిన దూడలు, పెద్ద పశువులకు ఏడాదికి రెండుసార్లు (ప్రతి 6 నెలలకు ఒకసారి) టీకాలు వేయించడం అత్యంత ముఖ్యమని సూచించారు. జిల్లాలో గాలికుంటు వ్యాధి నిర్మూలనకు ప్రతి పశుపోషకుడు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande