
హైదరాబాద్, 23 మార్చి (హి.స.) విద్య అనేది మనిషి జీవితాన్ని
మార్చే అత్యంత శక్తివంతమైన సాధనమని.. సమాజ అభివృద్ధికి.. వ్యక్తిగత ఎదుగుదలలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీలో గల విద్యాభారతి పాఠశాలలో 20 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను సోమవారం ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, జాతీయ విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధిని పెంపొందించడంలో విద్యా భారతి సంస్థల కృషి అభినందనీయమన్నారు.
ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలంటే పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి విద్యార్థి ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలాషించారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానంలోనూ సంస్కరణలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాఠశాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే జీఎంఆర్ ను సంస్థ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యా భారతి సంస్థ దక్షిణ క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, భారతి విద్యా సమితి అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, కార్యదర్శి రవి, టప్ప కుమార్, సంస్థ ప్రతినిధులు, పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..