
సంగారెడ్డి, 23 మార్చి (హి.స.)
జిల్లాలో రైతుల ఆదాయం రెట్టింపు, వ్యవసాయ ఉత్పాదకతలో గణనీయ వృద్ధి సాధించేందుకు ఫార్మ్ మెకనైజేషన్, వర్షాధార ప్రాంతాల అభివృద్ధి, తేనెటీగల పెంపకం పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో వ్యవసాయ, ఉద్యానవన, డీఆర్డీఏ శాఖల అధికారులతో ఈ పథకాల పురోగతిపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన ఫార్మ్ మెకనైజేషన్ లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు సాధించిన పురోగతిని పరిశీలించి, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు(UCs)వెంటనే సమర్పించాలని ఆదేశించారు.
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పురోగతి సాధించాలని, రైతులను యాంత్రీకరణ వైపు మరింత ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా మినీ ట్రాక్టర్లు, పవర్ వీడర్స్, పవర్ టిల్లర్స్, బ్రష్ కట్టర్స్, పవర్ స్ప్రేయర్స్ కొనుగోలుకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని. జిల్లాలో ఇప్పటివరకు 97 యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు.
వర్షాధార ప్రాంతాల అభివృద్ధి, రైతుల ఆదాయ పెంపు, ఆహార భద్రత, వ్యవసాయ ఉత్పాదకత మెరుగుదలకు సమగ్ర వ్యవసాయ విధానాలు అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన, డీఆర్డీఏ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
తేనెటీగల పెంపకం కార్యక్రమాన్ని మరింత విస్తరించాలని, ఎక్కువ మంది రైతులకు బీహైవ్ యూనిట్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలను కమర్షియల్ స్థాయి తేనెటీగలపెంపకానప్రోత్సహించాలని డీఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు