
తిరుమల, 23 మార్చి (హి.స.)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోవడంతో, క్యూ లైన్లు వెలుపలికి వచ్చి శిలాతోరణం వరకు కిలోమీటర్ల మేర విస్తరించాయి. ఎండ తీవ్రత ఉన్నప్పటికీ, భక్తులు ఓపికతో స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.
ఇక టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం లభించడానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. ఆదివారం స్వామివారిని మొత్తం 86,091 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,664 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి నిన్న ఒక్కరోజే రూ.4.21 కోట్ల ఆదాయం లభించింది. రద్దీ దృష్ట్యా క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV