
కైకలూరు,, 24 మార్చి (హి.స.), : నియోజకవర్గంలో సంచలనంగా మారిన పసి పిల్లల విక్రయాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సోమవారం ముదినేపల్లి, ఏలూరు, విజయవాడకు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు గ్రామీణ సీఐ రవికుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కార్యాలయంలో ముదినేపల్లి ఎస్సై వీరభద్రరావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆ వివరాల మేరకు .. పిల్లల విక్రయాలపై జిల్లా మాతాశిశు సంరక్షణ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈనెల 14న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంతానం లేని కొందరు దంపతులు అబ్బిశెట్టి వీరమ్మ అనే మధ్యవర్తిని సంప్రదించారు. ఆమె ముగ్గురు పిల్లలను వారి బంధువుల అంగీకారంతో ముగ్గురు దంపతులకు అప్పగించింది. మరో ఇద్దరు పిల్లలను ముదినేపల్లి మండలం అన్నవరం, మండవల్లి మండలం కానుకొల్లు దంపతులకు అప్పగించింది. ఈ ఇద్దరి పిల్లలను విజయవాడకు చెందిన ఫరీనా, ఏలూరుకు చెందిన ఓ నర్సు మరికొందరి సహకారంతో దంపతులకు ఇచ్చింది. ఇందుకు ఒక బిడ్డకు రూ.3 లక్షలు, మరో బిడ్డకు రూ.80 వేలు వసూలు చేశారు. సదరు దంపతులు పిల్లల ఆధారు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఈ విషయం బట్టబయలైంది. ఆ ఇద్దరి పిల్లల అసలు తల్లిదండ్రులు ఎవరనేది తెలియరాలేదు. దత్తతకు చట్టబద్ధత లేని కారణంగా ఇద్దరు చిన్నారులను శిశు సంరక్షణ గృహానికి తరలించారు.
పిల్లల విక్రయాల్లో విజయవాడకు చెందిన ఫరీనా కీలక సూత్రధారి. ఇప్పటికే ఈమెపై విజయవాడ తదితర ప్రాంతాల్లో పిల్లల అపహరణ వంటి 5 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది. న్యాయస్థానం అంగీకారంతో ఫరీనాను విచారణ చేసి పూర్తి వివరాలు తెలుసుకుంటామని సీఐ తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముదినేపల్లి, ఏలూరు, భీమవరం ప్రాంతాలకు చెందిన వీరమ్మ, చిన్ని, రెడ్డమ్మ, గోపి, మాధురి, కలిక్లను అరెస్టు చేశామని, కోర్టులో హాజరు పరుస్తామని వివరించారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగిస్తున్నామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ