
అమరావతి, 24 మార్చి (హి.స.)
ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల పాఠ్యాంశాలు లీక్ అయ్యాయి. సెకండియర్ పాఠ్యపుస్తకాల సాఫ్ట్కాపీలను కొందరు బయటకు లీక్ చేశారు. ముద్రణ కంపెనీల నుంచే సీడీలు లీక్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని సీరియ్సగా తీసుకున్న తెలుగు అకాడమీ వివరణ ఇవ్వాలని వీజీఎస్ పబ్లిషర్స్కు నోటీసు జారీచేసింది. అయితే, తమ మెయిల్ను హ్యాక్ చేసి, పాఠ్యాంశాలను కాపీ చేశారని ఆ కంపెనీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇంటర్ విద్యాశాఖలో మొదటిసారిగా పాఠ్యపుస్తకాల కంటెంట్ ప్రైవేటు కాలేజీల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీనిని ప్రభుత్వం సీరియ్సగా తీసుకుని విచారణ చేస్తోంది.
ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాల ముద్రణ రెండు రకాలుగా జరుగుతోంది. ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇచ్చే పుస్తకాలను ఉచితం విభాగంలో ముద్రిస్తారు. ప్రైవేటు కాలేజీలకు ఇచ్చే పుస్తకాలను సేల్ బుక్ విభాగం అంటారు. వచ్చే విద్యా సంవత్సరానికి సేల్ బుక్ ముద్రణను వీజీఎస్, విక్రమ్ కంపెనీలు టెండరు ద్వారా దక్కించుకున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ విద్యాశాఖ కీలక సంస్కరణలు చేసింది. గణితం ఎ, బిలను కలిపి ఒకటిగా చేసింది. బోటనీ, జువాలజీని బయాలజీ చేసింది. ఎన్సీఈఆర్టీ విధానాన్ని చాలావరకు అన్వయించుకుంది. ఈ సంస్కరణలు ఈ ఏడాది ఫస్టియర్ విద్యార్థులకు అమలయ్యాయి. వచ్చే ఏడాది సెకండియర్లోనూ ఈ మేరకు మార్పులు జరగాల్సి ఉంది. ఆ మేరకు నూతన విధానంలో తయారుచేసిన పాఠ్యపుస్తకాలను తెలుగు అకాడమీ ద్వారా ఇంటర్ విద్యాశాఖ ముద్రిస్తోంది. కొత్త పుస్తకాల సేల్ బుక్ ముద్రణ బాధ్యతను ఆ రెండు కంపెనీలకు వారం కిందట అప్పగించింది. ఆ కంపెనీలకు తెలుగు అకాడమీ సాఫ్ట్ కాపీలు పంపింది. వాటిని ముద్రించి, పుస్తకాలు తెలుగు అకాడమీకి అప్పగించడం మాత్రమే ఆ కంపెనీల బాధ్యత. అయితే రెండు రోజుల కిందట ఫిజిక్స్, గణితం, ఇతర కొన్ని సబ్జెక్టుల పుస్తకాల కాపీలు వాట్సా్పలోకి వచ్చేశాయి. అక్కడి నుంచి అనేక ప్రైవేటు కాలేజీలకు ఈ కాపీలు చేరాయి. దీంతో ఇంటర్ విద్యాశాఖలో పెద్ద దుమారం రేగింది. కీలకమైన పాఠ్యపుస్తకాలు ఎలా బయటకు వెళ్లాయనే దానిపై విచారణ చేపట్టిన తెలుగు అకాడమీ ముద్రణ కంపెనీ ల ద్వారానే లీకేజీ జరిగిందనే ప్రాథమిక అంచనాకు వచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని వీజీఎస్ కంపెనీకి నోటీసులు జారీచేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ