
అమరావతి, 24 మార్చి (హి.స.)
జనసేన’ పార్టీ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై పలు ముఖ్య అంశాలపై చర్చించనున్నారు. విజయవాడలోని నోవోటల్ హోటల్లో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పార్టీ అంతర్గత కమిటీల నియామకం ప్రధాన అజెండాగా ఉండనుంది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై సమగ్రంగా చర్చించి నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
అదేవిధంగా ఎమ్మెల్యేలకు అదనపు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించే అంశంపైనా సమావేశంలో చర్చ జరగనుంది. పార్టీ పనితీరును మెరుగుపరచడం, స్థానిక స్థాయిలో పార్టీ చురుకుదనాన్ని పెంచడం లక్ష్యంగా నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణను కట్టుదిట్టం చేసేందుకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి), క్రమశిక్షణ కమిటీలు ఏర్పాటు చేసే అంశంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కూడా సమావేశంలో సమీక్ష జరగనుంది.
ప్రస్తుతం జనసేన పార్టీకి సుమారు 15 లక్షల మంది సభ్యత్వం ఉన్నట్లు సమాచారం. నేటితో సభ్యత్వ నమోదు గడువు ముగియనుండగా.. దాన్ని మరో మూడు రోజుల పాటు పొడిగించే యోచనలో జనసేన పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా మరింత మంది సభ్యులను ఆకర్షించాలని నాయకత్వం భావిస్తోంది. మొత్తంగా ఈ సమావేశం జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణకు కీలకంగా మారనుంది. పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు పార్టీ దిశను నిర్ణయించనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ