
హైదరాబాద్, 31 మార్చి (హి.స.)
తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగోలేదని..
అప్పులో నెట్టుకొస్తోందన్న కాగ్ నివేదికగాపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
'రాష్ట్ర రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ దగ్గర చేయి చాచాల్సిన దుస్థితిలోకి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టేసింది.. కాగ్ 2024 - 25 నివేదిక రాష్ట్ర ఖజానా పరిస్థితిని బట్టబయలు చేసింది. ఏడాదిలో రెండు రోజులు తప్ప మిగిలిన 363 రోజులు రిజర్వ్ బ్యాంకు నుంచి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీస్, ఓవర్ డ్రాఫ్ట్ల పేరుతో చేబదుళ్లు చేసింది.. 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో ఇలా రూ.1.30 లక్షల కోట్లు తెచ్చి సర్కారును నెట్టుకొచ్చింది. చేబదులుగా తెచ్చిన మొత్తాన్ని ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తిరిగి చెల్లించాల్సి ఉండగా.. 2025 మార్చి 31 నాటికి సుమారు రూ.6 వేల కోట్లు చెల్లించలేకపోయింది. నెలకు సుమారు రూ.12 వేల కోట్ల సొంత ఆదాయం ఉన్న మన రాష్ట్ర ఖజానాలో రోజువారీ ఖర్చులకు రూ.1.38 కోట్ల బ్యాలెన్స్ కూడా మెయింటేన్ చేయలేని స్థితికి తెలంగాణను తీసుకెళ్లింది. రూ.8.65 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు మోపిన కాంగ్రెస్ ప్రభుత్వం రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ దగ్గర చేయి చాపుతూ ఇంకా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రమని చెప్పడం ప్రజలను మోసం చేయడమే.
ఎన్నికలకు ముందు సంపద పెంచుతాం... దానిని పేదలకు పంచుతాం అన్న కాంగ్రెస్ నాయకుల మాటలు వట్టి డొల్ల అని కాగ్ నివేదికతో బట్టబయలు అయ్యింది' అని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు