స్పీడ్ 40 ఆచరణ సాధ్యమేనా
నగరంలో పోలీసులు అమలు చేస్తున్న గరిష్ఠ వేగ పరిమితి నిబంధనలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి
Traffic


విశాఖపట్నం, 01 ఏప్రిల్ (హి.స.)నగరంలో పోలీసులు అమలు చేస్తున్న గరిష్ఠ వేగ పరిమితి నిబంధనలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వేగపరిమితి 40 కిలోమీటర్లకు మించితే జరిమానా విధిస్తామని సీపీ శంఖబ్రతబాగ్చి ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే 40 కిలోమీటర్ల పరిమితి పాటించేందుకు వాహన చోదకులు ఎప్పటికప్పుడు స్పీడో మీటర్పై దృష్టిపెడితే ఏకాగ్రత దెబ్బతిని రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలంటే వాహనాల వేగానికి కళ్లెం వేయాలని సీపీ శంఖబ్రతబాగ్చి భావించారు. దీనికోసం నగర పరిధిలో అగనంపూడి నుంచి కొమ్మాది వరకు జాతీయ రహదారిపైనా, కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు బీచ్రోడ్డులోనూ, నగర పరిధిలోని అన్ని మునిసిపల్ రోడ్లపైన వాహనాల గరిష్ఠ వేగపరిమితిని 40 కిలోమీటర్లుగా నిర్ణయించారు. అంతకంటే ఎక్కువ వేగంతో వాహనాలను నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరంలో వాహనాల వేగపరిమితిపై నిఘా పెట్టేందుకు ఎక్కడికక్కడ లేజర్గన్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గరిష్ఠ వేగపరిమితి మించితే రూ.వెయ్యి జరిమానా విధించడంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కోసం రవాణా శాఖ అధికారులకు పంపిస్తామని స్పష్టంచేశారు. సీపీ ప్రకటనపై నగరంలో తీవ్ర చర్చ జరుగుతోంది. చాలామంది సీపీ నిర్ణయాన్ని తప్పుపడుతుండగా, కొందరు మాత్రం నగర నడిబొడ్డున 40 కిలోమీటర్లు వేగపరిమితి ఉంచడంలో తప్పులేదుగానీ, డెయిరీ ఫారం నుంచి కొమ్మాది వరకు, ఎన్ఏడీ జంక్షన్ నుంచి అగనంపూడి వరకు వేగపరిమితిని 60 కిలోమీటర్లకు పెంచే దిశగా ఆలోచన చేయాలన సూచిస్తున్నారు.

వాహన చోదకులు వేగం 40 కిలోమీటర్లులోపే ఉండేలా నిరంతరం పర్యవేక్షించుకోవాలనుకుంటే ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, గ్రీన్సిగ్నల్ పడిన తర్వాత వాహనాలను వేగంగా ముందుకు నడపాల్సి ఉంటుందని, ఒకవేళ నెమ్మదిగా వెళితే ట్రాఫిక్ సమస్య మరింత జఠిలంగా మారి సిగ్నల్ దాటడానికే రెండు, మూడుసార్లు వేచివుండాల్సిన పరిస్థితి వస్తుందని పలువురు చెబుతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య పెరగడంతోపాటు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడం సాధారణంగా మారిపోతుందని అభిప్రాయపడుతున్నారు. వాహనం నడిపే వ్యక్తి వేగం 40 కిలోమీటర్లులోపే ఉందో లేదో తెలుసుకునేందుకు తరచూ స్పీడోమీటర్పై దృష్టిపెట్టాల్సి ఉంటుందని, ఆ సమయంలో రోడ్డుపై ముందువెళ్లే వాహనం ఆగినా, ఎవరైనా అడ్డువచ్చినా గమనించేందుకు అవకాశం ఉండదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ముందువెళ్లే వాహనాలు నెమ్మదిగా నడుస్తుంటే వెనుకనుంచి భారీ వాహనాలు ఢీకొన్న సందర్భాలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ ఏడాది జూన్ నుంచి అందుబాటులోకి తెస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇటువంటి తరుణంలో వేగపరిమితి విధించడం ఎందుకంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. నగరం నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకోవాలంటే ఇప్పుడు గంటకుపైగా సమయం పడుతుందని, ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే మరో 30 నిమిషాలు అదనంగా పడుతుందని, అలాంటి సమయంలో 40 కిలోమీటర్లు మించిన వేగంతో వాహనం నడిపితే జరిమానా తప్పదని హెచ్చరించడం సరికాదని పేర్కొంటున్నారు. డెయిరీఫారం దాటిన తరువాత వాహనాలు కనీసం 60 కిలోమీటర్ల వేగంతో వెళతాయని, అలాంటిచోట కూడా 40 కిలోమీటర్లు మించకూడదని చెప్పడం సమంజసం కాదనే వాదన వినిపిస్తోంది. ప్రమాదాల నియంత్రణకు ఇతర చర్యలపై దృష్టిపెట్టాలని కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande