అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్: ఇకపై ఒకటో తారీఖునే జీతాలు!
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటవ తారీకు జీతాలు
Out source


హైదరాబాద్, 02 ఏప్రిల్ (హి.స.)

ఇప్పటికే ప్రతి నెల ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇకపై కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం అదే రోజున జీతాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అందుకోసం అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిసింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సేవలు అందించే ఏజెన్సీలకు వారం రోజుల ముందే బిల్లులు చెల్లించాలని ఆదేశించినట్లు సమాచారం.

ప్రస్తుతం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఏ తేదీన వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. కొన్ని శాఖలు మొదటి వారంలో, మరికొన్ని రెండో వారంలో, ఇంకొన్ని శాఖల్లో అయితే ఏకంగా నెల చివరన చెల్లిస్తున్నారు. దీంతో ఉద్యోగులు ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి, రెగ్యులర్ ఉద్యోగులకు ఇస్తున్నట్లుగానే ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ క్రమంలోనే ఆర్థిక శాఖ అధికారులు అన్ని శాఖలకు, హెచ్డీ (HOD)లకు లేఖలు రాసి, ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

ఇప్పటివరకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపు విషయంలో సదరు ఏజెన్సీలపై ప్రభుత్వ పర్యవేక్షణ లేదు. అయితే ఇక నుంచి జీతాల చెల్లింపు, పీఎఫ్ (PF), ఇతర అంశాలను ఆర్థిక శాఖ పర్యవేక్షించనుంది. అందుకోసం ఒక ప్రత్యేక పోర్టల్ను రూపొందించినట్లు తెలిసింది. ఈ పోర్టల్లోనే ఏజెన్సీలు విధిగా ఉద్యోగుల వివరాలను నమోదు చేయాలి. పూర్తి వివరాలు అందించిన ఏజెన్సీలకు వారం రోజుల ముందే ప్రతి నెల బిల్లులు చెల్లిస్తారు. ఏజెన్సీలు తమ వాటా కింద పీఎఫ్, ఈఎస్ఐ (ESI) చెల్లించకపోతే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande