
అమరావతి, 02 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బిల్లు బుధవారం లోక్ సభలో ఆమోదం పొందగా మరికొద్ది సేపట్లో రాజ్య సభలో ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవ్వనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందడం ఏపీ అభివృద్ధికి ఒక మలుపు అని అభివర్ణించారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన అతి తక్కువ కాలంలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం పట్ల ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజధాని అమరావతి పట్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్న ద్వేషం నిన్నటితో మరోసారి బయటపడిందని ఈ సందర్భంగా చంద్రబాబు విమర్శించారు.
ఈ రోజు రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందనున్న సందర్భంగా ఈరోజు సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పండుగలా సంబరాలు జరుపుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో తాను మధ్యాహ్నం పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొంటానని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV