30 ఏళ్ల తర్వాత మళ్లీ హిందూమతంలోకి.. భూమన చొరవతో సనాతన ధర్మంలోకి బాల్య స్నేహితుడు
హిందూమతాన్ని స్వీకరించిన భూమన బాల్య స్నేహితుడు
30 ఏళ్ల తర్వాత మళ్లీ హిందూమతంలోకి.. భూమన చొరవతో సనాతన ధర్మంలోకి బాల్య స్నేహితుడు


తిరుపతి, 02 ఏప్రిల్ (హి.స.)తిరుపతిలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ ఛైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో ‘హిందూమత పున:స్వీకరణ మహోత్సవం’ జరిగింది. 30 ఏళ్ల క్రితం ఇస్లాం మతం స్వీకరించిన ఓ జంట, భూమన చొరవతో తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చారు. ఈ సందర్భంగా భూమన తన నివాసంలో ప్రత్యేక హోమం నిర్వహించి వారిని హిందూ మతంలోకి ఆహ్వానించారు.

తిరుపతికి చెందిన శ్రీనివాసులు రెడ్డి, పుష్ప దంపతులు సుమారు 30 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం కువైట్ వెళ్లారు. అక్కడి పరిస్థితుల దృష్ట్యా వారు ఇస్లాం మతం స్వీకరించి, తమ పేర్లను అబ్దుల్లా, అమీనాగా మార్చుకున్నారు.. శ్రీనివాసులు రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చిన్ననాటి స్నేహితులు. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరూ తిరుపతిలో కలుసుకున్నారు. ఈ క్రమంలో తన స్నేహితుడు మతం మారాడని తెలుసుకున్న భూమన, తిరిగి హిందూ ధర్మంలోకి రావాలని కోరారు. ముఖ్యంగా గత రెండేళ్లుగా ఆయన పదేపదే విజ్ఞప్తి చేయడంతో శ్రీనివాసులు రెడ్డి దంపతులు ఆలోచించి సనాతన ధర్మంలోకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు.

ఈ నిర్ణయాన్ని భూమనకు తెలుపగా, ఆయన తన పద్మావతిపురంలోని నివాసంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ ఆశయానికి అనుగుణంగా నా స్నేహితుడిని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావడం ఎంతో సంతృప్తినిచ్చింది అని భూమన వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande