
కరీంనగర్, 01 ఏప్రిల్ (హి.స.)
చొప్పదండి నియోజకవర్గంలోని
అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు ఇల్లు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో గత రెండేళ్లలోనే చొప్పదండి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు తెలిపారు. కురిక్యాల గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 208 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 94 మంది లబ్ధిదారులు సొంత ఇళ్లను నిర్మించుకుని గృహప్రవేశం చేసినట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు