
హైదరాబాద్, 01 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏర్పాటుకు చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో (Amaravati Bill Lok Sabha) కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్వాగతించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పున విభజన చట్టం 2014లో తెలంగాణకు పలు కీలక హామీలు ఉన్నాయని.. వాటి అమలు విషయంలో కేంద్రం వివక్షపూరితంగా ఆందోళన వ్యవహరించడం కలిగిస్తోందన్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి ముఖ్య ప్రాజెక్టులు ఇంకా ఆచరణకు నోచుకోలేదన్నారు. ఇవి తెలంగాణ అభివృద్ధికి కీలకమని ఆయన గుర్తుచేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు వంటి అంశాల్లో కూడా కేంద్రం మాట తప్పిందని దుయ్యబట్టారు. ఒక రాష్ట్రానికి చట్టబద్ధతతో ముందుకు తీసుకెళ్లే చర్యలు తీసుకుంటూ, మరో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను విస్మరించడం సరైంది కాదని తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు