
హైదరాబాద్, 01 ఏప్రిల్ (హి.స.)
రాష్ట్రంలో నేటి నుంచి మూడు నెలలకు సంబంధించిన సన్నబియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీకి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. ఎండల తీవ్రత దృష్ట్యా లబ్ధిదారులు ప్రతినెలా క్యూలైన్లలో నిలబడకుండా ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది. గోదాముల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలను త్వరగా ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో ఈ సీజన్ బియ్యం కూడా రానుండటంతో ఆలోగా ఉన్న నిల్వలను రేషన్ కార్డు దారులకు పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గత సీజన్లలో సేకరించిన ధాన్యం నిల్వలు పెరిగిపోవడం మరోవైపు మిల్లింగ్ పూర్తయి వచ్చిన బియ్యంతో గోదాముల్లో భారీగా నిల్వలు పేరుకుపోయాయి.
దీంతో ఈ నిల్వలను వెంటనే పంపిణీ చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల కిందట జిల్లా గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు సన్నబియ్యం తరలింపు ప్రక్రియ పూర్తయింది. రేషన్ బియ్యం సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల కార్డుల ద్వారా 3.20 కోట్ల లబ్దిదారులకు 2.15 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం పంపిణీ చేయనుంది.
అందులో ఫుడ్సెక్యూరిటీ కార్డు లోని ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున, అంత్యోదయ కార్డు కలిగిన వారికి 35 కిలోలు, కిలో చక్కెర, అన్నపూర్ణ కార్డు ఉన్నవారికి 10 కిలోల సన్నబియ్యం తో పాటు 5 కిలోల గోధుమలు పంపిణీ చేస్తారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు నెల రోజుల పాటు రేషన్ పంపిణీ చేయనున్నారు. మరోవైపు ఏప్రిల్ నెల నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ దుకాణాలను ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవలే ప్రకటన చేశారు. కొత్త రేషన్ షాపులను ఓపెన్ చేయడంతో ప్రజలకు రేషన్ సరుకులను సరఫరా చేయడంలో మరింత వేగం పెరగనుంది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకేసారి 3 నెలలకు సరిపడా స్టాక్ను అందుబాటులో ఉంచుకునేందుకు రేషన్ దుకాణాల్లో సరిపడా స్థలం లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకేసారి వందల క్వింటాళ్ల బియ్యాన్ని తమ వద్ద ఉంచుకునేంత పరిస్థితి లేకపోవడంతో డిమాండ్కు తగ్గట్లు రేషన్ డీలర్లకు బియ్యం సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా ఈ-పాస్ యంత్రాల్లో సాంకేతిక లోపాలు, వేర్వేరుగా బయోమెట్రిక్ తీసుకోవడం పంపిణీలో జాప్యం జరగనుంది. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో బియ్యం పంపిణీ చేయడంతో తూకం వేయడంలో డీలర్లకు ఇబ్బందులు ఎదురైతాయి.
ప్రతినెలా అవసరమైన దానికంటే మూడింతల ఎక్కువ బియ్యం ఒకేసారి తరలించడం, వాటిని లబ్దిదారులకు అందించడం డీలర్లకు శ్రమతో కూడుకున్న పనిగా మారింది. డీలర్ ఒక కార్డుదారుడికి రేషన్ ఇవ్వడానికి 20 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ సమస్యను పరిష్కరించడంతో పాటు బ్లూ టూత్ మిషన్ విషయంలో సడలింపు ఇవ్వాలని, ఒక కుటుంబానికి చెందిన బియ్యం ఒకేసారి పంపిణీ చేసే విధంగా వెసులుబాటు కల్పించాలని డీలర్లు కోరుతున్నారు. ఈ-పాస్, ఎలక్ట్రానిక్ కాంటాక్టు బ్లూటూత్ లింక్ తొలగిస్తే పంపిణీ సులభమవుతుందని సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..