
అమరావతి, 01 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి, ప్రజల ఆకాంక్షలకు లభించిన గౌరవమని ఆయన అభివర్ణించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ, గత ప్రభుత్వ పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయాయి. ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. రైతుల త్యాగానికి దక్కిన గౌరవం ఇది. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఒక కీలక మైలురాయి. అమరావతి ఇక అజేయం.. అజరామరం అని అన్నారు.
ఈ బిల్లు ఆమోదానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV