నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్ సమావేశం
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్ సమావేశం జరగనుంది
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్ సమావేశం


అమరావతి, 10 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ నేడు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. ఈ భేటీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల పార్లమెంట్లో రాజధాని అమరావతి చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి క్యాబినెట్ కృతజ్ఞతలు తెలపనుంది.

ఇక పెట్టుబడుల అంశంలో భాగంగా, 16వ ఎస్ఐపిబి ( సమావేశంలో చర్చించిన ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 31 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.39,436 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంతో పాటు, ఉపాధి అవకాశాలను కూడా పెంచనున్నాయి.

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ కింద మూడు ప్రముఖ సంస్థల స్థాపనకు కూడా క్యాబినెట్ అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే విద్యా రంగానికి సంబంధించి ఫీజు రెగ్యులేటరీ కమిటీ (FRC) ఏర్పాటు కోసం ఆర్డినెన్స్కు కూడా ఆమోదం తెలపనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించనున్న క్యాబినెట్.. పలు సంస్థలకు భూ కేటాయింపులకు అమోదం తెలపనుంది. అదే విధంగా, రాష్ట్రంలో 28 జిల్లాల ఆధారంగా జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశంపై కూడా చర్చ జరగనుంది. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు, మల్టీ జోనల్ వ్యవస్థ అమలు చేసే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande