రక్త చరిత్రే రాజనీతి అని వైసీపీ భావిస్తోంది: మంత్రి నిమ్మల
వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు.
Nimmala


అమరావతి, 12 ఏప్రిల్ (హి.స.)మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రక్త చరిత్రనే రాజకీయంగా మార్చుకుని వైసీపీ రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధ్వంసం, వినాశనాలతో కూడిన మహిళా, యువజన విధానాలను వైసీపీ రూపొందించిందని నిమ్మల మండిపడ్డారు. 'చంపేస్తాం, నరుకుతాం, అంతం చేస్తాం' అనే విధానంతో వైసీపీ ముందుకు సాగుతోందని అన్నారు. అధికారంలోకి వస్తే పనులు నిలిపివేయడం, నిర్మాణాలను కూల్చివేయడం, యువతను చెడగొట్టడం వంటి చర్యలు చేపడతామని వైసీపీ చెబుతోందని విమర్శలు గుప్పించారు.

ఇంకా మాట్లాడుతూ.. రాజకీయాలకు అడ్డొస్తే సొంత వారినీ వదలని చరిత్ర వైసీపీదని, వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే పరిటాల రవి, వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన సాక్షులు, నిందితులు అనుమానాస్పదంగా మరణించిన విషయంపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు ప్రజలను, మీడియాను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా నిమ్మల ఆరోపించారు. ఆంధ్రజ్యోతి పత్రికను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. గుంటూరు ప్రాంతంలో ప్రజలను బెదిరించే విధంగా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.

. చివరగా, 'గొడ్డలి పార్టీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టాలి' అంటూ మంత్రి నిమ్మల పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande