
అమరావతి, 12 ఏప్రిల్ (హి.స.)దేశవ్యాప్తంగా 2027 జనగణన ప్రక్రియ ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జనగణన నిర్వహణకు సంబంధించిన ముఖ్యమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో జనగణనను దశలవారీగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు హౌస్లిస్టింగ్ & హౌసింగ్ సెన్సస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ముందు ప్రజలకు 15 రోజులపాటు సెల్ఫ్ ఎన్యూమరేషన్ సదుపాయం కల్పించనున్నారని సమాచారం. అలాగే మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరగబోయే 2027 జనగణన ప్రక్రియకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కూటమి ప్రభుత్వం కోరింది. 1948 జనగణన చట్టం ప్రకారం ప్రజల విధులు, బాధ్యతలను స్పష్టంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 12న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. జనగణన నిర్వహణ కోసం వచ్చే సిబ్బందికి ప్రజలు తప్పనిసరిగా సహకరించాలని ప్రభుత్వం సూచించింది. నిబంధనల ప్రకారం జనగణన సిబ్బందికి ప్రశ్నలు అడిగే అధికారం ఉందని, వారు కోరిన సమాచారాన్ని సరైన విధంగా అందించాలని తెలిపింది.
సెన్సస్ చట్టం 1948 ప్రకారం నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించనున్నట్లు వెల్లడించింది. జనగణన అధికారులకు సహకరించని వారికి రూ.1000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా ఉండొచ్చని హెచ్చరించింది. అయితే, జనగణన కోసం సేకరించిన వ్యక్తిగత వివరాలను ఇతరులు పరిశీలించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేసింది. జనగణన ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావాలంటే ప్రజల సహకారం అత్యంత కీలకమని ప్రభుత్వం పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్