క్రెడిబిలిటీ లేని వారు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు: మంత్రి సత్యకుమార్
ప్రజల తిరస్కరణకు గురైన పార్టీలు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు.
Satyakumar


విశాఖపట్నం, 12 ఏప్రిల్ (హి.స.)ప్రజల తిరస్కరణకు గురైన పార్టీలు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. క్రెడిబిలిటీ లేని వారు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా.. తామే తీసుకు వచ్చామని వైఎస్ జగన్ అంటున్నారని తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోయాయని గుర్తు చేశారు.

గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటో తెలియని వ్యక్తి జగన్ అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి డేటా సెంటర్ తానే తీసుకువచ్చానని అంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఉందన్నారు. ప్రజలు దృష్టి మళ్లించడం కోసం ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ జగన్పై మండిపడ్డారు. వైఎస్ జగన్.. మావిగన్ అంటే ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు.

పశ్చిమ బెంగాల్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అవుతోందని మంత్రి సత్యకుమార్ జోస్యం చెప్పారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. నారీ శక్తి వందన్ అధినియం పేరిట మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాని మోదీ తీసుకొస్తున్నారని తెలిపారు.

ఏప్రిల్17, 18 తేదీలలో జరగనున్న పార్లమెంట్ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయని మంత్రి సత్యకుమార్ అన్నారు. దేశంలో 50 శాతం మంది మహిళలు ఉన్నా.. కేవలం 13 శాతం మందికి మాత్రమే చట్ట సభల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని , మహిళా సాధికారత అంటే మాటల్లోనే కాదు చేతల్లో చూపించాలని ఎన్డీయే కూటమి భావిస్తోందని చెప్పారు. వచ్చే ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని ఆలోచన చేస్తునట్లు మంత్రి తెలిపారు. మహిళలకు పగ్గాలు ఇస్తే ఒక కుటుంబాన్ని ముందుకు నడిపించినట్లుగా సమర్ధవంతంగా పాలన చేస్తారని ఆయన పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande