
గన్నవరం, 10 ఏప్రిల్ (హి.స.)
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు మరో విమాన సర్వీసును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. 2024లో ప్రారంభమైన ‘ఫ్లై91’ సంస్థ ఉడాన్ పథకం ద్వారా అంచెలంచెలుగా ఎదిగి.. దక్షిణాది రాష్ట్రాల్లో విశేష విమాన సేవలు అందిస్తున్నట్లు కేంద్రమంత్రి కొనియాడారు. ఈనెల 17వ తేదీ నుంచి హైదరాబాద్ వేదికగా 22 రాకపోకలు నిర్వహించేందుకు ముందుకొచ్చిన ఆ సంస్థ నిర్వాహకులను అభినందించారు. త్వరలో దుబాయ్, వారణాసి, కొచ్చితోపాటు ఇతర సర్వీసుల రాకపోకలకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విజయవాడ, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు జూన్ నాటికి పూర్తిచేసుకుని.. జులైలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు చేతులమీదుగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
గోవా కేంద్రంగా దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమాన సేవలు అందిస్తున్న ఈసంస్థకు చెందిన సర్వీసును స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్తో కలిసి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ అందజేసి ప్రారంభించారు. రాష్ట్రంలో విజయవాడతో పాటు రాజమండ్రి విమానాశ్రయం నుంచి తొలుత తన సర్వీసులను హైదరాబాద్కు ఫ్లై 91 సంస్థ ఆరంభిస్తోంది. విజయవాడ నుంచి ఉదయం 7.30కు బయలుదేరి హైదరాబాద్ కు 8.40కు ఈ రోజువారీ సర్వీసు చేరుకుంటుంది. ఏప్రిల్ 17 నుంచి మరో సర్వీసును కూడా విజయవాడ నుంచి హైదరాబాద్కు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ