
ఖమ్మం, 10 ఏప్రిల్ (హి.స.)
ఖమ్మం జిల్లా కూసుమంచి
మండలంలోని చేగొమ్మలో శుక్రవారం వ్యవసాయ పంట గోదాము ప్రారంభం సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, ధాన్యం కొన్న వారం రోజుల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామని, రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి రూ.12వేలు ఇస్తున్నామని అన్నారు. ధరణితో రైతులు ఇబ్బందులు పడ్డారని దాన్ని బంగాళాఖాతంలో వేసి భూ భారతి తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఎనభై వేల మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మీద హాట్ కామెంట్స్ చేశారు.
కొంతమంది వారికి అంటిన బురదని అధికార పార్టీకీ, అధికార పార్టీ నాయకులకు అంటించాలని చూస్తున్నారని విమర్శించారు. ఎవరు ఎన్ని కారుకూతలు కూసిన భవిష్యత్తులో ఇందిరమ్మ ప్రభుత్వంని ప్రజలు దీవించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎవరు ఎన్ని అవాకులు చవాకులు పేలిన ఈ ప్రభుత్వం పేద వారికి అండగా ఉంటుందని, తాటాకు చప్పుళ్లకు బెదరం అని హెచ్చరించారు. సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు ఐదు వందల బోనస్ ఇస్తున్నామన్నారు. సన్న వడ్లను ఇతర ప్రాంతాలకు పంపించకుండా రాష్ట్రంలోని పేదలకు రేషన్ ద్వారా ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..