
నిజామాబాద్, 10 ఏప్రిల్ (హి.స.)
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుంచి 18 వరకు చేపట్టనున్న అరైవ్ – అలైవ్ కార్యక్రమాలను జిల్లాలో విస్తృత స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య సూచించారు. ఈ కార్యక్రమం అమలు తీరుపై రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం సా యంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు.దేశవ్యాప్తంగానే కాకుండా రాష్ట్రంలోనూ రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటి నియంత్రణ కోసం ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాల్సిన ఆవశ్యకతను తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించేలా చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై వివరించారు.
వీసీ అనంతరం కలెక్టర్, సీపీ ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు వీలుగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఉన్నదని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi