ముగిసిన ఏపీ కేబినేట్ భేటీ
ఇవాళ ఉదయం ప్రారంభమైన ఏపీ కేబినేట్ భేటీ ముగిసింది. పలుకీలక నిర్ణయాలు తీసుకున్నారు
ముగిసిన ఏపీ కేబినేట్ భేటీ


అమరావతి

, 10 ఏప్రిల్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో 60 అంశాల ఎజెండాపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం, భారీ పెట్టుబడులను ఆకర్షించడం, ఉన్నత విద్యలో సంస్కరణలు వంటి ముఖ్యమైన అంశాలపై కేబినెట్ దృష్టి సారించింది.

సమావేశంలో ప్రధానంగా, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చేసినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అమరావతి బిల్లుకు పార్లమెంటులో మద్దతిచ్చిన అన్ని పార్టీలకు కూడా కేబినెట్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు.

రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చేలా, 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో చర్చించిన రూ.39 వేల కోట్లకు పైగా విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటై, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు, విశాఖపట్నంలోని క్వాంటం వ్యాలీలో మూడు సంస్థల ఏర్పాటుకు కూడా మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఈ నెల 14న క్వాంటం కంప్యూటర్స్కు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande