
ములుగు, 10 ఏప్రిల్ (హి.స.) రాష్ట్రంలోని ప్రజలు ఆరోగ్యకరంగా ఉండాలని ఉద్దేశంతోనే రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం వైద్యానికి ప్రత్యేక నిధులను కేటాయిస్తుందని, ములుగు జిల్లాను ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శుక్రవారం ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఆయుష్ దినోత్సవ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని బంజారా భవన్లో కలెక్టర్ దివాకర్ టి.ఎస్ అధ్యక్షతన యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యోగ ద్వారా శారీరక-మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రతి ఒక్కరు ప్రతి రోజు యోగా కార్యక్రమాలు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరం ఉండి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకున్న పక్షంలో ఎలాంటి వ్యాధులు దరిచేరవని అన్నారు.
వెంకటాపూర్ మండలం వెలుతుర్లపల్లె గ్రామానికి చెందిన 23 మంది కూలీలు మిర్చి పంట ఏరడానికి ఆటోలో వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కూలీలందరూ గాయపడగా వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందించాలని, మెరుగైన చికిత్స కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..