
కడప, 11 ఏప్రిల్ (హి.స.)
జిల్లా ఖాజీపేటలో బాలికను గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది వెంకటేశ్పై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల అదుపులో ఉన్న వెంకటేశ్ శనివారం తెల్లవారుజామున తప్పించుకునేందుకు యత్నించాడు. మైదుకూరు నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో ఇద్దరు కానిస్టేబుళ్లను గాయపరిచాడు. పారిపోతున్న నిందితుడిని అడ్డుకునేందుకు పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే నిందితుడు ఎదురు తిరిగాడు. దీంతో అతడి కాళ్లపైకి పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన నిందితుడిని కడప రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఖాజీపేట అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, నాగ మునెమ్మ దంపతుల కుమార్తె(17) ఇంటర్ పూర్తి చేసింది. మండల పరిధిలోని ఆంజనేయ కొట్టాల గ్రామానికి చెందిన వెంకటేశ్ కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని పలుమార్లు ఒత్తిడి చేయగా.. ఆమె నిరాకరిస్తూ వస్తోంది. దీంతో వెంకటేశ్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదను చూసి బాలిక ఇంటికి వచ్చిన అతడు తనను పెళ్లి చేసుకోవాలని మళ్లీ ఒత్తిడి తెచ్చాడు. ఆమె ససేమిరా అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు తన వెంట తెచుకున్న కత్తితో ఆమె గొంతుకోసి పరారయ్యాడు. ఈ విషయం తెలిసిన యువతి తండ్రి శ్రీనివాసులు, ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను తండ్రి శ్రీనివాసులు చేతుల్లో మోసుకొని వెళ్లి వాహనంలోకి చేర్చారు. ఆమెను కడప రిమ్స్కు తరలించే ప్రయత్నం చేశారు. కొనఊపిరితో ఉన్న ఆమె.. వెంకటేశ్, ప్రవీణ్ల పేర్లను తన తండ్రి వద్ద ప్రస్తావించింది. మిగతా విషయాలు చెప్పడానికి ప్రయత్నించినా.. మాట్లాడలేకపోయింది. ఆమె మార్గమధ్యలో చెన్నూరు వద్ద ప్రాణాలు విడిచింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ