
అమరావతి , 11 ఏప్రిల్ (హి.స.)
అంబులెన్స్ సైరన్ వినిపించిందంటే.. అక్కడ కాలంతో యుద్ధం జరుగుతోందని అర్థం. ఆ స్టీరింగ్ వెనుక సాధారణంగా పురుషులే కనిపిస్తారు. కానీ, మృత్యువు అంచున ఉన్న ప్రాణాలను కాపాడడానికి ఒక మహిళ ముందుకొచ్చింది. ఆమే మన్నెం కల్పన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే భారీ వాహనాలను నడిపే లైసెన్స్ పొంది, అంబులెన్స్ డ్రైవర్గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలానికి చెందిన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు కల్పన. డిగ్రీ పూర్తి చేసి, టీచర్గా పిల్లలకు పాఠాలు చెబుతూ స్థిరపడ్డారు. అయితే, ఆ నాలుగు గోడల మధ్యే తన జీవితం పరిమితం కాకూడదని, సమాజానికి ఏదో ఒక రూపంలో నేరుగా సేవ చేయాలని ఆమె నిశ్చయించుకున్నారు. ఆ సంకల్పమే ఆమెను అత్యవసర సేవల వైపు నడిపించింది. ఏపీఎస్ఆర్టీసీ నిర్వహించిన డ్రైవింగ్ శిక్షణలో 15 మంది పురుషులతో పోటీ పడి నిలబడ్డ ఏకైక మహిళ కల్పన. 42 ఏళ్ల వయసులో “నీవల్ల కాదు” అన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ సాధించారు. ఇప్పుడు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి లో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ట్రాఫిక్ జంక్షన్లను దాటుకుంటూ, రోగిని సకాలంలో ఆసుపత్రికి చేర్చడంలో కల్పన చూపిస్తున్న తెగువ అమోఘం. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నైట్ షిఫ్టుల్లో కూడా వందల కిలోమీటర్లు అంబులెన్స్ను నడుపుతూ రోగులకు అండగా నిలుస్తున్నారు. వెనుక రోగి ప్రాణభయంతో ఉంటే, బంధువుల ఆర్తనాదాల మధ్య గుండె నిబ్బరంతో వాహనాన్ని గమ్యస్థానానికి చేరుస్తున్నారు. సాహసం చేయాలే కానీ, మహిళలకు సాధ్యం కానిది ఏదీ లేదు అని కల్పన నిరూపిస్తున్నారు. 42 ఏళ్ల వయసులో ఆమె చూపిస్తున్న తెగువ, సేవాగుణం నేటి తరం ఆడపిల్లలకు ఒక పాఠం
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi