ఐలాపూర్లో హైడ్రా.. వివాదాస్పద భూముల స్వాధీనానికి చర్యలు
వివాదాస్పద భూములను స్వాధీనం చేసుకోనున్న హైడ్రా
Hydra


సంగారెడ్డి, 11 ఏప్రిల్ (హి.స.)

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నేడు వేకువజామునే పెద్ద సంఖ్యలో వాహనాల్లో వందలాది మంది హైడ్రా సిబ్బందికి గ్రామానికి చేరుకున్నారు. ఆఫీసర్లు, వాహనాలు, బలగాలతో ఊరే నిండిపోయింది.

పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్ పూర్ మండలం ఐలాపూర్ లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. 1200 ఎకరాల వివాదాస్పద ఇనాం భూముల సంరక్షణకు రంగంలోకి దిగింది. ఇప్పటికే దాదాపు 400 ఎకరాల వరకు కబ్జా అయ్యింది. కొందరు అక్రమార్కులు భూములను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా పెద్ద ఎత్తున శనివారం వేకువజామున రంగంలోకి దిగింది. వందలాది పోలీసులు, హైడ్రా సిబ్బంది భారీ ప్రొక్లైనర్లు, ఇతర వాహనాలతో గ్రామానికి చేరుకున్నారు. వచ్చి రాగానే గ్రామంలో ఆరు అంతస్తుల భవనాన్ని కూల్చివేత ప్రారంభించారు. అలాగే అడ్వకేట్ ముఖీంకు చెందిన గెస్ట్ హౌజ్ను కూడా కూల్చి వేస్తున్నారు. అపార్ట్మెంట్లో ఉంటున్న వారికి ముందస్తుగానే నోటీసులు ఇచ్చినట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి దాదాపు 830 ఎకరాలకు పెన్సింగ్ ఏర్పాటు చేయడానికి హైడ్రా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఐలాపూర్ హైడ్రా కూల్చివేతలకు గ్రామస్తులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ భూముల కబ్జా అరికట్టాలని పెద్ద ఎత్తున గ్రామస్తులు ప్లకార్డులు పట్టుకుని మద్దతు పలికారు. పలువురు యువకులు పటాకులు పేల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి గ్రామస్తులు పాలాభిషేకం కూడా చేశారు. ఐలాపూర్ లో వందల ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, వాటిని కాపాడాలని గ్రామస్తులు హైడ్రా అధికారుల విజ్ఞప్తి చేస్తున్నారు. ఐలాపూర్, మరియు ఐలాపూర్ తండాలో చాలా కాలంగా 1200 ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతోంది. ఈ భూములపై సుప్రీం కోర్టులో కూడా కేసులు కొనసాగుతున్నాయి. నిజాం కాలం నాటి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. భూములు ప్రభుత్వానివేనని అధికారులు వాదిస్తుండగా తమకు సంబందించినవేనని కోర్టుకు వెళ్లారు.

ఈ భూముల విషయంలో పలు సందర్భాల్లో గొడవలు జరిగాయి. దాదాపు 300 ఎకరాలకు పైగా అన్యాక్రాంతం అయినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఐలాపూర్ భూముల వ్యవహారం రాజకీయంగా అందరికీ తెలిసిన అంశంగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా ఈ భూముల సంరక్షణకు హైడ్రా నడుంకట్టింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande