
హైదరాబాద్, 11 ఏప్రిల్ (హి.స.) హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్
ఆదేశాల మేరకు గోల్కొండ జోన్ పరిధిలోని మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున పోలీసులు భారీ స్థాయిలో 'కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం' నిర్వహించారు. డీసీపీ చంద్ర మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం, గ్యాస్ సిలిండర్లు మరియు సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోల్కొండ జోన్ డీసీపీ చంద్ర మోహన్ పర్యవేక్షణలో శనివారం తెల్లవారుజామున 6 గంటల నుండి 8 గంటల వరకు ఈ తనిఖీలు కొనసాగాయి.
జుమ్రాత్ బజార్లోని లాలాభవన్ నుండి రాహుల్ ఫుట్వేర్ వరకు, కున్నా పాన్ షాప్, లాలా తాలీమ్ నుండి టక్కర్వాడి, బుధే బాబా హనుమాన్ దేవాలయం మరియు లోయర్ ధూల్పేట్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అణువణువూ గాలించారు. తనిఖీల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. మద్యం 49.4 లీటర్ల విస్కీ మరియు బీరు సీసాలు.22 కమర్షియల్, 12 డొమెస్టిక్ మరియు 79 చిన్న గ్యాస్ సిలిండర్లు, సరైన పత్రాలు లేనివి మరియు నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్కు పాల్పడిన 28 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..