
హైదరాబాద్, 11 ఏప్రిల్ (హి.స.)
నేడు రెండో రోజు కూడా (శనివారం) నార్సింగి సర్కిల్ అధికారులు ఫుట్ పాత్ ఆక్రమణల పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఉదయం నుంచే రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మణికొండ, నెక్నాంపూర్ డివిజన్ పరిధిలో శనివారం ఉదయం 6 గంటల నుంచే మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. సుమారు 10 కిలోమీటర్ల మేర రోడ్లపై ఫుట్ పాత్ లపై ఉన్న ఆక్రమణలను 16 జేసీబీ యంత్రాల సహాయంతో తొలగిస్తున్నారు. గుడిసెలు, జిరాక్స్ సెంటర్లు, ఆక్రమణలకు గురైన బస్సు షెల్టర్లను తొలగిస్తున్నారు.
లాంకో హిల్స్ జి సర్కిల్ నుంచి ఓయూ కాలనీ వరకు, ఫ్రెండ్స్ కాలనీ నుంచి నార్సింగి వైపునకు వెళ్లే రహదారిలో అలనాటి హోటల్ వరకు, ప్రేరణ ఆసుపత్రి మీదుగా గౌతమ్ మోడల్ స్కూల్, గోల్డెన్ టెంపుల్ సెక్రటేరియట్ కాలనీ లో ఉన్న ఆక్రమణలు, ప్రతిభస్కూల్ నుంచి నెక్నం పూర్ చింతచెట్టు సర్కిల్ వరకు, యోగా సర్కిల్ నుంచి అల్కాపూర్ రోడ్ నెంబర్ 30 వరకు రహదారులపై ఉన్న ఆక్రమణలతో పాటు ఫుట్ పాత్రపై ఏర్పాటు చేసుకున్న వీధి వ్యాపారాలను మున్సిపల్ సిబ్బంది జెసిబిలతో తొలగిస్తున్నారు. మణికొండ ప్రాంతంలో భారీ ఎత్తున ఆక్రమణలు తొలగించడం తీవ్ర చర్చకు దారితీసింది. కొందరు నేతలకు చెందిన ఆక్రమణలు కూడా అధికారులు తొలగించారు. అతి పెద్ద డ్రైవ్ చేపట్టిన అధికారులు ఆక్రమణలు తొలగించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..