
కర్నూల్ , 11 ఏప్రిల్ (హి.స.)
సైబీరియన్ పక్షులు సందడి చేస్తున్నాయి. ఎక్కడో రష్యాలో వుండే సైబీరియన్ పక్షులు ఖండాంతరాలు దాటీ తమజాతిని పెంచుకునేందుకు కర్నూలును ఆవాసంగా చేసుకుంటున్నాయి. వేలాది పక్షులు రంగు రంగుల శరీరాకృతిలో ఆకట్టుకుంటున్నాయి. కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు అందుకు వేదికగా మారింది.
కర్నూలు మండలంలో గార్గేయపురం చెరువు సమీపంలోనే నగర వనం పేరుతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు చిట్టడవిని తయారు చేశారు. ఆ పక్కనే సహజంగా ఉన్న చెరువులో బోటింగ్ ఏర్పాటు చేశారు. సెలవుల్లో కుటుంబసభ్యులతో సరదాగా గడిపేందుకు నగరవాసులు ఇక్కడికి వస్తుంటారు. రష్యా లోని సైబీరియా ప్రాంతానికి చెందిన పక్షులు ఖండాంతరాలు దాటి కర్నూలు చేరుకున్నాయి. సైబీరియా పక్షులు రష్యాలోని అత్యంత శీతల వాతావరణం నుండి, శీతాకాలంలో వెచ్చని ప్రదేశాల కోసం వేలాది కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశానికి వస్తాయి. ఆహారం, అనుకూలమైన వాతావరణం కోసం భారత్ కు వస్తుంటాయి. సైబీరియాలో మంచు కారణంగా ఆహారం దొరకకపోవడం, తీవ్రమైన చలి కారణంగా ఈ పక్షులు వేటగాళ్ల నుండి తప్పించుకుని వెచ్చని ప్రదేశాలకు వలస వస్తాయి. ఏపీ లో కొల్లేరు సరస్సు, నేలపట్టు, పులికాట్ సరస్సు ,శ్రీకాకుళం జిల్లాలోని తేలినీలాపురం వంటి ప్రాంతాల్లో ఈ పక్షులు ఎక్కువగా సందడి చేస్తాయి. అయితే ఇప్పుడు కరువు నేల కర్నూలుకూ వలస వస్తున్నాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi