
కరీంనగర్, 11 ఏప్రిల్ (హి.స.)కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పోలీస్ శాఖలో పనిచేసి మరణించిన ఉద్యోగుల వివరాలను అడ్డు పెట్టుకుని, నకిలీ అకౌంట్ల ద్వారా సుమారు రూ.1 కోటి 40 లక్షలు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది. ఈ అక్రమాలకు సంబంధించి ఏసీపీ టాస్క్ ఫోర్స్ వాసాల సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ I-టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముఖ్య నిందితుడు హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్, అతనికి సహకరించిన రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వై.వి. ముని రామయ్య, నకిలీ ఖాతాల సృష్టించడంలో భాగస్వాములైన ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చినా, విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడినా శాఖాపరంగా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi