
హైదరాబాద్, 12 ఏప్రిల్ (హి.స.) తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడు (Telangana Inter Results) విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) భరోసా కల్పిస్తూ ఎక్స్ వేదికగా కీలక ట్వీట్ చేశారు. ఈ 'ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ కీలక సందేశాన్ని ఇచ్చారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, తమ తదుపరి లక్ష్యాల దిశగా అడుగులు వేస్తున్న విద్యార్థులందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వారి భవిష్యత్తు ప్రయాణం దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షించారు.
ముఖ్యంగా పరీక్షల్లో ఆశించిన మార్కులు రాని, విఫలమైన విద్యార్థుల గురించి బండి సంజయ్ ప్రత్యేకంగా స్పందించారు. మార్కులు మీ అంచనాల ప్రకారం రాకపోతే అస్సలు ధైర్యం కోల్పోకండి. గుండె చెదరనివ్వకండి. ఇది కేవలం మీ ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమే కానీ, మీ అంతిమ గమ్యం కాదు. మీ భవిష్యత్తు అనేది ఈ ఒక్క ఫలితం మీద ఆధారపడి ఉండదు.. మీరు తర్వాత ఏం చేస్తారు? ఎలా అడుగులు వేస్తారు? అనే దానిపైనే మీ విజయం ఆధారపడి ఉంటుంది అని విద్యార్థుల్లో భరోసా నింపారు. ఒక్క ఫలితంతో జీవితాన్ని నిర్ణయించుకోవద్దని, మరిన్ని అవకాశాలు భవిష్యత్తులో వస్తాయని ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. బండి సంజయ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ధైర్యాన్ని నింపుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు