
హైదరాబాద్, 12 ఏప్రిల్ (హి.స.)
ఆసియాలోనే అత్యంత భారీ జలవిద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుగా పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఉండబోతుంది. ఎందుకంటే జంబో టర్బైన్ల సాంకేతికతతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. తక్కువ ఎత్తుతోనే ఎక్కువ కరెంట్ ఉత్పత్తి చేసేలా ఇందులో అధునాతన సాంకేతికతను వినియోగించనున్నారు. దాదాపు 80 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో 12 యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. తద్వారా భవిష్యత్తులో 960 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. దీంతో విద్యుత్ కొనుగోలు వ్యయంలో సుమారు రూ. 1,100 కోట్లు ఆదా కానుండటం గమనార్హం. ఈ ప్రాజెక్టు 2028 జనవరికి పూర్తి చేయాలని ఏపీ జెన్కో తన ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకుంది.
పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. అతి తక్కువ హెడ్తోనే అత్యధిక విద్యుత్ను ఉత్పత్తి చేసేలా ఈ ప్రాజెక్టు కోసం అధునాతన సాంకేతికతను ఉపయోగించున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వినియోగించే టర్బైన్లు, జనరేటర్లు, ఎలక్ట్రో-మెకానికల్ పరికరాలను భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సరఫరా చేస్తోంది. ప్రస్తుతం పంప్ హౌస్ నిర్మాణం, ఇంజినీరింగ్ పనులన్నీ శరవేగంగా సాగుతున్నాయి. దాంతో గోదావరి పుష్కరాల నాటికి కనీసం 3 యూనిట్లు ప్రారంభించాలని ఏపీ జెన్కో లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 4 యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన టర్బో జనరేటర్లను బీహెచ్ఈఎల్ అందించింది. వీటిని అమర్చే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
పోలవరం ప్రాజెక్టు వద్ద విద్యుదుత్పత్తి కోసం 27 మీటర్ల హెడ్ అనేది ఉంటుంది. అయితే ఇదే హెడ్తో నాగార్జునసాగర్ టెయిల్పాండ్లో ఏర్పాటు చేసిన జలవిద్యుత్ కేంద్రంలో కేవలం 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. ఇదే హెడ్తో పోలవరంలో ఒక్కొ యూనిట్ నుంచి 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. దానికోసం అతిపెద్ద వర్టికల్ కెప్లాన్ సెమీ స్పైరల్ టర్బైన్లను ఏర్పాటు చేస్తున్నారు. నీటి ప్రవాహానికి అనుగుణంగా యాంగిల్ మార్చుకునే సదుపాయం అనేది వీటికి ఉంటుంది.
-
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi