
ఖమ్మం, 12 ఏప్రిల్ (హి.స.)
జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మత్తు వ్యసన నిర్మూలన సలహా కేంద్రం(డీ అడిక్షన్ సెంటర్)ను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ డీ రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యపానం, మత్తు పదార్థాల అలవాట్లకు బానిసైన వారికి సలహా సేవలు, చికిత్స సహాయం, పునరావాస మార్గదర్శకత్వం ఈ సెంటర్ ద్వారా అందించబడుతుందన్నారు.
మత్తు పదార్థాలు పదేపదే వినియోగించడం వలన శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయన్నారు. గుండె సంబంధిత సమస్యలు, మానసిక అస్థిరత, కుటుంబ కలహాలు, సామాజిక సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు.
అనంతరం చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం నరేందర్, మానసిక వైద్య నిఫుణులు డాక్టర్ సౌమ్యమిశ్రా, ఔషధ పరిశీలకుడు అనిల్, పాలేరు నుంచి నర్సింగ్ విద్యార్థులు, ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi