నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యంగానే ఉన్నారు..ఖండించిన కుటుంబసభ్యులు
నాదెండ్ల భాస్కరరావు అనారోగ్యంగా ఉన్నారంటూ చేసిన పుకార్లను ఆయన కుమారుడు ఖండించారు
నాదెండ్ల


అమరావతి, 12 ఏప్రిల్ (హి.స.)

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఆయన కుమారుడు, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం ఖండించింది. నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయన ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది.

నాదెండ్ల భాస్కరరావు అస్వస్థతకు గురయ్యారని, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. వృద్ధాప్య సమస్యలతో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తోందని ప్రచారం జరిగింది. కొందరైతే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కూడా పోస్టులు పెట్టారు.

ఈ ప్రచారం విస్తృతం కావడంతో మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం వెంటనే స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. భాస్కరరావు ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయన ఆరోగ్యంపై ప్రజలు, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరింది. ఈ స్పష్టతతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande