రహదారి భద్రత అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత.. సజ్జనార్
రహదారి భద్రత ప్రతీ పౌరుడి బాధ్యత అని అన్నారు సజ్జనార్
Sajjanar


హైదరాబాద్, 12 ఏప్రిల్ (హి.స.) రహదారి భద్రత అనేది కేవలం నిబంధనల అమలు మాత్రమే కాదు, అది ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని సైబరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్ స్పష్టం చేశారు. తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి మానసపుత్రిక అయిన 'అరైవ్ అలైవ్' కార్యక్రమం 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు ఒక ప్రత్యేక ఉద్యమంగా నేడు (ఏప్రిల్ 12, 2026) ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా రోడ్డు ప్రమాదాలపై దిగ్భ్రాంతికర గణాంకాలను వెల్లడిస్తూ పౌర చైతన్యం కోసం పిలుపునిచ్చారు.

తెలంగాణలో ఏటా హత్యల వల్ల సుమారు 800 మంది మరణిస్తుండగా, రోడ్డు ప్రమాదాల వల్ల ఏకంగా 7,500 మంది ప్రాణాలు కోల్పోతున్నారని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. అంటే హత్యల కంటే రోడ్డు ప్రమాద మరణాలే తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉండటం మనందరం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయమని ఆయన పేర్కొన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి ఉల్లంఘనలు ఏటా రెట్టింపు అవుతూ ఎన్నో కుటుంబాలను తీరని శోకంలోకి నెడుతున్నాయని హెచ్చరించారు.

ఒక కుటుంబం ఇంటి పెద్దదిక్కును కోల్పోతే ఆ కుటుంబం పడే వేదన, ఆర్థిక ఇబ్బందులు వర్ణనాతీతమని, ప్రమాదాల్లో గాయపడిన వారు శారీరక పాటు భారీ వైద్య ఖర్చులతో కృంగిపోతున్నారని సీపీ వివరించారు. గమ్యాన్ని వేగంగా చేరడం కాదు. క్షేమంగా చేరడమే ప్రయాణానికి అసలైన సార్థకత అని ఆయన హితవు పలికారు. 'అరైవ్ అలైవ్' కేవలం ప్రభుత్వ కార్యచరణగా మిగిలిపోకుండా, ప్రతి పౌరుడు బాధ్యతగా స్వీకరించినప్పుడే రోడ్డు ప్రమాద రహిత సమాజం అవతరిస్తుందని సీపీ సజ్జనార్ తన ట్వీట్ ద్వారా ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande