
ములుగు, 12 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు అందించిన సెల్ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ పథకాలపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుతుంది అంటూ ఘాటుగా హెచ్చరించారు. ములుగులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
అంగన్వాడీ టీచర్ల కోసం ఒక్కో సెల్ఫోన్ను రూ.11,650కే కొనుగోలు చేశామని, కానీ కొందరు రూ.14 వేలకు కొన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలుంటే చూపించాలని సవాల్ విసిరారు. తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మేడారం జాతర పనుల్లోనూ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై స్పందిస్తూ.. అవసరమైతే దీనిపై సీబీఐ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని సీతక్క విమర్శించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు తనను ప్రలోభాలకు గురిచేయాలని చూసినా లొంగలేదని గుర్తుచేశారు. ఎన్నికల్లో తనను ఓడించడానికి వందల కోట్లు ఖర్చుపెట్టి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi