
హైదరాబాద్, 12 ఏప్రిల్ (హి.స.)
లక్షలాది మంది విద్యార్థుల ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ వార్షిక పరీక్షల ఫలితాలు-2026 విడుదలయ్యాయి. హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఫలితాల్లో ఇంటర్ ఫస్టియర్లో 66.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్లో 70.58 శాతం మంది పాసయ్యారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించి తమ సత్తా చాటారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,495 పరీక్షా కేంద్రాల్లో సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. అనంతరం మార్చి 15 నుంచి ఏప్రిల్ 1వ తేదీ మధ్య 20 కేంద్రాల్లో సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియను రికార్డు సమయంలో పూర్తి చేసి, వేగంగా ఫలితాలను సిద్ధం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi