
గుజరాత్, 13 ఏప్రిల్ (హి.స.)
గుజరాత్ (Gujarath) రాష్ట్రంలోని సురేంద్రనగర్ (Surendra Nagar) జిల్లాలో హృదయ విదారక ఘటన ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. లఖ్తర్-విరామగామ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. లఖ్తర్ హైవేపై దేదాద్ర (Dedadra) గ్రామం సమీపంలో ఓ కారు, ఎసీయూవీ (SUV) ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఒక కారులో భయంకరంగా మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో కారు మొత్తాన్ని చుట్టేయడంతో లోపల ఉన్న ప్రయాణికులకు బయటకు వచ్చే అవకాశం లేకుండాపోయింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ఉన్న ఏడుగురు ప్రాణాలతో ఉండగానే మంటల్లో కాలి బూడిదయ్యారు.
వధ్వన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పీబీ జడేజా (P.B. Jadeja) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. మరో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..