
కలకత్తా 13 ఏప్రిల్ (హి.స.)
పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా సవరణ (SIR) అంశంపై విచారణ సందర్భంగా ఎన్నికల అధికారులపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితాలో కొనసాగే హక్కు ఓటర్లకు ఉందని.. కేవలం ఎన్నికలు జరుగుతున్నాయనే కారణంతో తాము గుడ్డిగా వ్యవహరించి ఆదేశాలు ఇవ్వమని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై విచారణ జరుగుతుండగా, ఎన్నికల హడావిడిలో ఉన్నామన్న అధికారుల వాదనపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
ఎన్నికలు అనేవి ఒక ప్రక్రియ మాత్రమేనని, అయితే ఓటర్ల జాబితాలో పేరు ఉండటం అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల సాకుతో ఈ హక్కులను విస్మరించడానికి వీల్లేదని హెచ్చరించింది. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు లిస్టులో కచ్చితంగా ఉండేలా చూడాలని పశ్చిమ బెంగాల్ ఎన్నికల అధికారులను కోర్టు ఆదేశించింది. 'ఎన్నికలు మనల్ని గుడ్డివాళ్లను చేయకూడదు' అని వ్యాఖ్యానిస్తూ, రాజ్యాంగ బద్ధమైన ఓటు హక్కు రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు