
హనుమకొండ, 15 ఏప్రిల్ (హి.స.)
బాలికల భవిష్యత్తు బలంగా ఉండాలంటే విద్యే ప్రధాన ఆధారం అని, బాల సదనంలో ఉన్న ప్రతి విద్యార్థిని బాగా చదువుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి సూచించారు. బుధవారం హనుమకొండ సుబేదారిలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల బాల సదనాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ నివసిస్తూ వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న బాలికలతో ఆత్మీయంగా మాట్లాడి వారి విద్యాభ్యాసం, వసతి, ఆహారం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. బాల సదనంలో ఉన్న విద్యార్థినుల సంఖ్య, వారు అభ్యసిస్తున్న కోర్సులు, వంటశాల నిర్వహణ, ఆహార నాణ్యతపై విద్యార్థినులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటగదిని పరిశీలించి, భోజన నాణ్యతను పరీక్షించారు.
వేసవి సెలవుల్లో బాలికల హాజరు, దత్తత ప్రక్రియలపై జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ మరియు సూపరింటెండెంట్ కళ్యాణి నుంచి వివరాలు తీసుకున్నారు. బాల సదనంలోని బాలికల పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, వారికి ఉత్తమ సంరక్షణ, విద్యా అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. దత్తతకు సంబంధించిన దరఖాస్తులు వచ్చిన పక్షంలో, బాలికల గార్డియన్ సమ్మతితో పారదర్శకంగా, వేగవంతంగా చర్యలు చేపట్టాలని సూచించారు. బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి, ఉన్నత స్థాయికి చేరుకునేలా కృషి చేయాలని ప్రోత్సహించారు. ఇద్దరు విద్యార్థినులు జనరల్ నర్సింగ్ కోర్సులో ప్రవేశం పొందేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా సంక్షేమ అధికారి వివరించగా, కలెక్టర్ వారికి అభినందించారు.
సందర్శన సమయంలో లక్ష్మీ ప్రసన్న అనే బాలికకు పుట్టినరోజు కావడంతో, జిల్లా కలెక్టర్ ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా దగ్గరకు తీసుకుని ఆశీర్వదించడం ద్వారా బాలికలో ఆనందం నింపారు. అనంతరం బాలికల కోసం సిద్ధం చేసిన భోజనాన్ని రుచి చూసి, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే బాల సదనానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి అవసరమైన సూచనలు అందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..