
న్యూఢిల్లీ, 15 ఏప్రిల్ (హి.స.)దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, ఎంపీ సీట్ల పెంపుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో.. ఒక సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వివాదాస్పద అంశంగా మారిన ఎంపీల సంఖ్య జోలికి వెళ్లకుండా.. క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువగా ఉండే ఎమ్మెల్యేల సంఖ్యను పెంచడం ద్వారా రాష్ట్ర అసెంబ్లీలను బలోపేతం చేయడమే అసలైన వికసిత్ భారత్ సంస్కరణ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాశ్ చేసిన ప్రతిపాదన అన్ని వర్గాల వారినీ ఆలోచింపజేస్తోంది.
దేశం కోసం చట్టాలు చేయడం, జాతీయ విధానాలను రూపొందించడం, అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రయోజనాలను కాపాడటం.. ఒక ఎంపీ ప్రాథమిక విధి. సామాన్య ప్రజల దైనందిన సమస్యలు, స్థానిక మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలు వంటివి నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు, ఎమ్మెల్యేల పరిధిలోకి వస్తాయి. ఈ నేపథ్యంలో స్థానిక అభివృద్ధి వేగవంతం కావాలంటే ఎంపీల కంటే ఎమ్మెల్యేల ప్రాతినిథ్యం పెరగడం అవసరమన్న వాదనలు ఆలోచింపజేస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్