
వరంగల్, 15 ఏప్రిల్ (హి.స.)నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే అసత్య ప్రచారానికి తెరలేపారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు విమర్శించారు. ఇవాళ (బుధవారం) వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని రాంచందర్రావు స్పష్టం చేశారు. 'సీట్ల పెంపు అనేది 2011 జనాభా లెక్కల ఆధారంగానే జరుగుతుంది. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల్లో గందరగోళం సృష్టించేలా మాట్లాడుతూ రాజకీయం చేస్తున్నారు' అని ఆయన మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 'హైబ్రిడ్ సిస్టమ్' అనే విధానం ప్రపంచంలోనే ఎక్కడా లేదని రాంచందర్రావు ఎద్దేవా చేశారు. డీలిమిటేషన్కు సంబంధించి రేవంత్ రెడ్డి చెబుతున్న ప్రతిపాదనలు అసంబద్ధంగా ఉన్నాయని, అవేవీ చట్టబద్ధమైనవి కావని ఆయన కొట్టిపారేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే I.N.D.I.A కూటమి, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు.
'నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదు. సీఎం రేవంత్ రెడ్డి తన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలి.' అని రాంచందర్రావు అన్నారు. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చ జరుగుతున్న వేళ, రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు కేవలం కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లడానికేనని రాంచందర్రావు విమర్శించారు. పునర్విభజన ప్రక్రియ చట్టప్రకారం పారదర్శకంగా జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్