దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా పులిగుండాల ప్రాజెక్టు.. భట్టి విక్రమార్క
దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా పులిగుండాల ప్రాజెక్టు.. భట్టి విక్రమార్క
భట్టి


ఖమ్మం, 15 ఏప్రిల్ (హి.స.)

ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం బ్రాహ్మళ్లకుంట గ్రామంలోని పులిగుండాల ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన పులిగుండాల ప్రాజెక్ట్ను దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అజయ్ యాదవ్, చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమా నాయక్, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ లతో కలిసి పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్ట్ను ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా బోటింగ్, వాటర్ ఫాల్స్, జంగిల్ సఫారీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈ అందమైన ప్రదేశాన్ని పరిచయం చేసిన స్థానిక ఎమ్మెల్యే, డి.ఎఫ్.ఓ. లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజం అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, తెలంగాణలోని ప్రకృతి సౌందర్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. కనకగిరి హిల్స్ అభివృద్ధిని తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పులిగుండాల ప్రాజెక్ట్ నీటి పరిసర ప్రాంతాల్లో రెండు వైపులా కాటేజీల నిర్మాణానికి 4 కోట్లు సిఎస్ఆర్ నిధుల నుండి మంజూరు చేయనున్నట్లు తెలిపారు. పనుల అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను వెంటనే సిద్ధం చేసి, పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు పూర్తవుతాయి అనే కాలపట్టికను సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. పర్యాటకులు ఈ ప్రాంతానికి సులభంగా చేరుకునే విధంగా డబుల్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు వెంటనే పంపించాలని ఆదేశించారు.

చాలా ఈ ప్రాంతంలో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తే స్థానిక ప్రజలకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో పులిగుండాల ప్రాజెక్ట్ను దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఒకటిగా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande