జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పై కూటమి కుట్రలు చేస్తోంది : వైఎస్ జగన్
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పై కూటమి కుట్రలు చేస్తోంది : వైఎస్ జగన్
jagan


అమరావతి, 15 ఏప్రిల్ (హి.స.)

నేడు మత్స్యకారులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మత్స్యకారుల ప్రయోజనాల కోసం తమ హయాంలో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా గత ప్రభుత్వం రూ.26 వేల కోట్ల పెట్టుబడులతో పోర్టులు, హార్బర్ల పనులు చేపట్టినట్లు ఆయన గుర్తు చేశారు.

వలసలు నివారించిన జువ్వలదిన్నె హార్బర్

ఈ సందర్భంగా ఒక మత్స్యకారుడు మాట్లాడుతూ, గతంలో జువ్వలదిన్నె హార్బర్ లేకపోవడం వల్ల తాము ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చేదని, జగన్ హయాంలో నిర్మించిన ఈ హార్బర్తో వలసలు తగ్గాయని వివరించారు. అయితే, ఇప్పుడు ఈ హార్బర్ను మత్స్యకారులకు కాకుండా ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు నుంచి వస్తున్న బోట్లను అరికట్టాలని, హార్బర్ను మత్స్యకారులకే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

పోర్టులు, హార్బర్ల అభివృద్ధికి అడుగులు

రాష్ట్రంలో మారిటైమ్ బోర్డును తీసుకువచ్చి పనులను వేగవంతం చేశామని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో నాలుగు కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు మరియు ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తీరంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండేలా ప్రణాళికలు రచించినట్లు వెల్లడించారు. రామాయపట్నం పోర్టు పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని, మూలపేట, మచిలీపట్నం పోర్టుల్లో 35 శాతం పనులు పూర్తి చేశామని, కాకినాడ పోర్టు పనులను కూడా వేగవంతం చేశామని ఆయన వివరించారు.

కూటమి ప్రభుత్వంపై విమర్శలు

మార్చి 12, 2024న వర్చువల్గా ప్రారంభించిన జువ్వలదిన్నె హార్బర్ను జాతికి అంకితం చేసి రెండేళ్లు అవుతున్నా, మత్స్యకారుల చేతికి ఎందుకు ఇవ్వడం లేదని జగన్ ప్రశ్నించారు. ఈ హార్బర్లో ఏటా 41 వేల టన్నుల మత్స్య సంపద దొరికే అవకాశం ఉందని, ప్రైవేటు డిఫెన్స్ కంపెనీల కోసం చంద్రబాబు మత్స్యకారులను ఇక్కడి నుంచి తరిమేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. జువ్వలదిన్నెలో 1,250 బోట్లు ఉండేలా తాము ప్రణాళిక చేశామని, కానీ ఇప్పుడు ఆ భూములను కార్పొరేట్ సంస్థలకు కేటాయిస్తున్నారని ధ్వజమెత్తారు

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande