
అమరావతి, 15 ఏప్రిల్ (హి.స.)శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి అనిత స్పందించారు.
శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్,ఎస్పీతో ఫోన్లో మాట్లాడి.. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమని హోం మంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్